విశాఖపట్టణం: అమరావతిపై ప్రేమ ఉంటే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్  నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సూచించారు.

సోమవారం నాడు ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. రఘురామకృష్ణంరాజు పులి వేషంలో ఉన్న నక్క అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్టణంతో సంబంధం లేని రఘురామకృష్ణంరాజు కేంద్రానికి లేఖ రాయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విశాఖకు సంబంధం లేని ఆయన ఎందుకు లేఖ రాశాడో చెప్పాలన్నారు. 

జగన్ భిక్షతో ఎంపీగా ఆయన గెలిచాడని మంత్రి అవంతి శ్రీనివాస్ రఘురామపై మండిపడ్డారు.  తమ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో  రఘురామకృష్ణంరాజు మైనస్ వన్ అంటూ ఆయన తేల్చి చెప్పారు.

రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడంతో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు. రోజూ ఏదో ఒక రకంగా రఘురామకృష్ణంరాజు వార్తల్లో నిలుస్తున్నారు. పార్టికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహం ఒక సర్వ్ నెంబర్లో ఉంది..తొట్ల కొండ ఒక సర్వ్ నెంబర్ లో ఉందని ఆయన చెప్పారు. బౌద్ధ క్షేత్రం పరిధి 20 ఎకరాల నుంచి 120 ఎకరాలు రక్షణ కంచె నిర్మించినట్టుగా మంత్రి తెలిపారు..

తొట్ల కొండ ను బౌద్ధ పవిత్ర పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.ప్రభుత్వ అతిధి గృహం నిర్మాణం ప్రభుత్వ కార్యక్రమానికి  రహస్య శంఖుస్థాపనలు లాంటివి ఉండవని ఆయన చెప్పారు.