నెల్లూరు: అబద్దాలు చెప్పడంలో మాజీమంత్రి నారా లోకేష్ తండ్రిని మించిపోయారంటూ విమర్శించారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు ఒక అబద్ధం చెబితే లోకేష్‌ పది అబద్దాలు చెప్తున్నారంటూ మండిపడ్డారు. 

నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారిని పరామర్శించకుండా ట్విట్టర్ కే పరిమితమయ్యారంటూ లోకేష్ పై విరుచుకుపడ్డారు. 

పడవను అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచేశారని మాజీమంత్రి నారా లోకేష్‌ చేసిన వాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. నెల్లూరు నగరంలో పేదల ఇళ్లు తొలగించే ప్రసక్తే లేదని మంత్రి అనిల్‌ హామీ ఇచ్చారు. 

మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శక విధానాలతో పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అనిల్ తెలిపారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలన్న నిర్ణయానికి చట్టబద్దత కల్పించడంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 

నిరుద్యోగులకు శిక్షణనిచ్చి ఆయా పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. పరిశ్రమలకు సంబంధించిన అవసరాలకు నీటిని అందిస్తామని వెల్లడించారు. శ్రీశైలం నుంచి రికార్డుస్థాయిలో ఒకే రోజు 2.4 టీఎంసీల నీటిని సోమశిల జలాశయానికి తీసుకువచ్చామని తెలిపారు. వరద నీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.