అమరావతి: ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ వస్తున్న వార్తలను ఖండించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రాజెక్టుల నిర్వహణపై తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. 

ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు, డ్యాం భద్రతకు ఎలాంటి ముప్పు లేదని తేల్చి చెప్పారు. ప్రాజెక్టులకు సంబంధించి నీటి పారుదల శాఖ అధికారులతో తాను స్వయంగా మాట్లాడినట్లు తెలిపారు. 

ఇరిగేషన్ అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నానని అయితే శ్రీశైలం డ్యామ్ భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యం అంటూ  ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమన్నారు. 

ప్రజల్లో లేనిపోని అనుమానాలు, అపోహలు కల్పించవద్దంటూ ప్రతిపక్షాలకు, పత్రికలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. అసత్య కథనాలు, అసత్య ప్రచారాలతో ప్రజల్లో భయాందోళన కలిగించడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.  

అంతకు ముందు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. పోలవరం ప్రాజెక్టును చూడని సీఎం జగన్ ఇవాళ ఇదే ప్రాజెక్టు విషయమై తనను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

పోలవరం విషయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పత్తా లేడు, సీఎం జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిర్వహించిన కంపెనీలను పక్కన పెట్టారని విమర్శించారు. 

వైసీపీ ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే అయ్యప్ప మాల వేసుకొన్న వారితో తిట్టిస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడ  సీఎం అభద్రతా భావంతో ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఆపాల్సిన బాధ్యత మీతో పాటు టీడీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డికి లేదా అని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిలదీశారు.  

 ఈ వార్తలు కూడా చదవండి

కరెన్సీ నోట్లను చించి పంచారు: వైసీపీపై దేవినేని ఉమ సంచలనం