అమరావతి: వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు మత విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. 

గురువారం నాడు విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో  మాట్లాడారు. మాల ధారణలో ఉండి  తమ పార్టీ చీఫ్ చంద్రబాబుతో పాటు తమ పార్టీకి చెందిన నేతలను నీచమైన భాషతో తిట్టిస్తున్నారని దేవినేని ఉమా మహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలపై నోరుపారేసుకొంటేనే మీ అపాయింట్‌మెంట్లు దక్కుతాయా అని ఆయన ప్రశ్నించారు. సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కై ధరలు పెంచింది వాస్తవం కాదా అని  దేవినేని ఉమ ప్రశ్నించారు.

మద్యం నియంత్రించే పేరుతో మద్యం కంపెనీలు, బార్లతో చీకటి ఒప్పందాలు చేసుకొన్నారని సీఎం జగన్‌‌ను ఆయన విమర్శించారు. ఈ విషయమై తాను ప్రశ్నిస్తే తనపై ఎదురు దాడి చేస్తున్నారని దేవినేని ఉమా చెప్పారు.


ఇసుక విషయంలో 68మంది పై ఫిర్యాదులు వస్తే వారి పై సీఎం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును చూడని సీఎం జగన్ ఇవాళ ఇదే ప్రాజెక్టు విషయమై తనను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారన్నారు. పోలవరం విషయంలో మంత్రి పత్తా లేడు, సీఎం నోరు ఎందుకు విప్పడని ఆయన ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు పనులు నిర్వహించిన కంపెనీలను పక్కన పెట్టారని ఆయన విమర్శించారు. మీ తప్పులను ప్రశ్నిస్తే అయ్యప్ప మాల వేసుకొన్న వారితో తిట్టిస్తున్నారని దేవినేని ఉమ గుర్తు చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడ  సీఎం అభద్రతా భావంతో ఉన్నారని ఆయన చెప్పారు. 

తిరుమల విషయంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని  ఆయన ప్రశ్నించారు.  తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఆపాల్సిన బాధ్యత మీతో పాటు టీడీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డికి లేదా అని ఆయన ప్రశ్నించారు.  

స్వర్ణ కాటేజీలో కూడ రాజకీయాలు చేశారా లేదో చెప్పాలన్నారు. స్వామి వారి అన్న ప్రసాదంతో పార్టీలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తిరుమల వంటి పవిత్ర ప్రదేశాన్ని పంచాయితీలకు అడ్డాగా మార్చారని ఆయన మండిపడ్డారు.

మైలరవం అసెంబ్లీ నియోజకవర్గంలో చించిన నోట్లను పంచి పెట్టింది మీ పార్టీ నేతలు కాదా అని దేవినేని ఉమా ఉమహేశ్వరరావు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కరెన్సీ నోట్లను  చించి పంచే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. 

ఈ విషయం సోషల్ మీడియాలో కూడ ప్రచారం జరిగినట్గుగా ఆయన తెలిపారు. ఈ విషయమై సీఎం, పోలీసు శాఖ స్పందించి బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్  అనుచరులే ఈ దుర్మార్గానికి పాల్పడినట్టుగా  మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అయ్యప్ప మాలలో ఉన్న ఎమ్మెల్యే వివరణ ఇవ్వాని  ఆయన డిమాండ్ చేశారు. 

ఎన్నికల సమయంలో కరెన్సీ నోట్లను చించి పంచిన విషయమై ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని ఆయన  కోరారు. ఇలాంటివి బయట పెడుతున్న తనను నోటికొచ్చినట్టుగా తిట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆయన  చెప్పారు. ఇటువంటి మాఫియా సంస్కృతిని ప్రోత్సహించేవారిని తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

మీడియా ప్రసారం చేయకపోయినా కూడ సోషల్ మీడియా స్పందించిందన్నారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త జీవోతో మీడియా సంస్థలు భయపడుతున్నాయని దేవినేని ఉమ మహేశ్వరరావు అభిప్రాయపడ్డారు.కరెన్సీ నోట్లను ముక్కలు ముక్కలుగా చింపిన విషయమై ఆర్బీఐ కూడ విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.