అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంచి మం.. లిని పంపిస్తా, ఎక్కడ కొరిగించుకుంటావో చెప్పు అని ఆయన దేవినేని ఉమాను ఉద్దేశించి అన్నారు. 

వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తి చేస్తారని, పూర్తయిన తర్వాత దేవినేని ఉమాకు బట్టలు పెడుతానని అంటూ ఎటువంటి బట్టలు కావాలో చెప్పు అని ఆయన అన్నారు. 

నెల తక్కువ ఉమ పేపర్ తెచ్చి 70 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని చెబుతున్నారని, ప్రాజెక్టు అంటే కేవలం డ్యామ్ మాత్రమే కాదని, పునరావాసం కూడా అని ఆయన అన్నారు. ఒక్క ఎస్టీకైనా ఇల్లు కట్టించావా అని ఆయన ఉమను అడిగారు. ప్రాజెక్టు వ్యయం 48 వేల కోట్లు అయితే, 16 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆయన అన్నారు. నీకు బలుపు, నోరు తెరిస్తే అబద్ధాలు అని ఆయన మండిపడ్డారు. 

పోతిరెడ్డిపాడుపై టీడీపీ తన వైఖరి చెప్పాలంటే చెప్పదని ఆయన అన్నారు. సిగ్గుశరం లేకుండా దేవినేని ఉమా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.  పోలవరం ప్రాజెక్టుపై దేవినేని ఉమా పదే పదే అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ చేసింది కేవలం 30 శాతం పనులు మాత్రమేనని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క భాగానికి సంబంధించిన పనులు మాత్రమే చేసిందని ఆయన అన్నారు. 

కాపర్ డ్యామ్ పెంచి పేదల ఇళ్లు ముంచి, వారికి నష్టం చేసిందని ఆయన అన్నారు. దేవినేని ఉమాకు కనీస జ్ఢానం లేదని ఆయన అన్నారు. జీవో 203పై తమ ప్రభుత్వాన్ని కృష్ణా వాటర్ బోర్డు వివరణ కోరిందని. తాము వివరణ ఇస్తామని ఆయన చెప్పారు.