టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇక శాశ్వతంగా హైదరాబాదుకు మారాల్సిందేనని ఆయన అన్నారు.

అమరావతి: కార్పొరేషన్లు 100 శాతం, మునిసిపాలిటీలు దాదాపు 99 శాతం తాము కైవసం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. వార్డులలో దాదాపు 84 శాతం గెలుచుకున్నామని చెప్పారు. టీడీపీ కేవలం 12 శాతంకే పరిమితమైందని అన్నారు. పంచాయతీలకన్నా కూడా అద్భుతమైన ఫలితాలు నిన్న వచ్చాయని అన్నారు.

సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ది, సంక్షేమం చూసి ప్రజలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారని, కనివినీ ఎరగని రీతిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీని గెలిపించారని ఆయన సోమావరం మీడియా ప్రితనిధుల సమావేశంలో అన్నారు. పరిపాలనను ప్రజలకు దగ్గరకు తీసుకురావడంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆదరించారని చెప్పారు. గ్రామంలో సచివాలయం, ఇంగ్లీష్‌ మీడియం స్కూల్, హెల్త్‌ సెంటర్‌ ఇలా అన్నీ ఒక్క చోటే ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.

విద్యా వ్యవస్ధలో తీసుకొస్తున్న పెనుమార్పులు, వైద్య రంగంలో తీసుకొస్తున్న మార్పులు, నాడు నేడు పేరుతో చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు.. ఇలా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం వల్లే ప్రజలు పట్టం కట్టారని మంత్రి అన్నారు.

తన పనే మాట్లాడుతుందనడానికి చక్కటి నిదర్శనం సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అని ఆయన ప్రశంసించారు. జగన్ చేపట్టిన ఏ కార్యక్రమం అయినా అది నేరుగా ప్రజలకే చేరుతోందని చెప్పారు. లోకల్‌ గవర్నెన్స్‌కు తాము మద్దతిస్తున్నామని ప్రజాభిప్రాయం వెల్లడయిందని అనిల్ కుమార్ అన్నారు. 

14 ఏళ్ళు సీఎంగానూ, రాజకీయాల్లో 40 ఏళ్ళ సీనియర్‌ నేతనని చెప్పుకున్న చంద్రబాబు ఇవాళ ఏ స్ధాయికి దిగజారిపోయాడో అర్ధమవుతుందని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు భాష చూస్తే ఎంత దిగజారిపోయాడో అర్ధమవుతుందని అన్నారు. ప్రజల్ని ఎంత రెచ్చగొట్టినా, అవమానపరిచినా వారు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని అన్నారు చంద్రబాబు శాశ్వతంగా హైదరాబాద్‌కు మకాం మార్చాలని వ్యాఖ్యానించారు. ఆయన సుపుత్రుడు మమల్ని ఏం పీకుతారు అన్నారని,. అందుకే వారిని ప్రజలు పీకి పక్కన పెట్టారని అన్నారు.

సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మీద నమ్మకంతో ప్రజలు ఇచ్చిన తీర్పుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అనిల్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఘనమైన తీర్పు వచ్చి ఉండదని అన్నారు. చంద్రబాబు 2024లో జెండా పీకి పారేస్తారని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు సరైన తీర్పునిచ్చి బుద్ధి చెప్పారని అన్నారు.

కనీసం పోటీ కూడా చేయలేని వారి గురించి ఏం మాట్లాడతామని అనిల్ కుమార్ అన్నారు. పీకుతాం పీకుతాం అన్నారని, తీరా వాళ్లనే పీకేశారని, వయసు పెరిగి మైండ్‌ బ్లాక్‌ అయి ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.