భద్రాచలంను అనుకున్న ఉన్న 5 గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయాలని తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఇరు రాష్ట్రాల్లో లేనిపోని వివాదాలకు తెరలేపటం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
గోదావరి భారీగా వరద రావడం.. భద్రాచలంలో చాలా కాలనీలు నీట మునగడంతో పోలవరం ముంపుపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భద్రాచలంను అనుకున్న ఉన్న 5 గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరడం హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రుల మధ్య మాటల యుద్దం సాగింది. తాజాగా తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.
ఇరు రాష్ట్రాల్లో లేనిపోని వివాదాలకు తెరలేపటం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పోలవరం ఎత్తు, ముంపు గ్రామాలు కలపటం ముగిసిన అధ్యాయాలు అని చెప్పారు. రాజకీయంగా ప్రతిపక్షాలతో పోటీ పడలేక నీటి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇవి కేవలం స్వార్ధం కోసం మాట్లాడే మాటలేనని అన్నారు. తాము ఎక్కడా కూడా తమ పరిధి దాటలేదని చెప్పారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నీళ్లలో దూకి విన్యాసాలు చేస్తే ప్రయోజనం ఉండదని విమర్శించారు.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు గ్రామాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఇటీవల గోదావరి వరదలతో వీరి డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. భద్రాచలానికి అనుకుని ఉన్న ఐదు గ్రామ పంచాయితీలకు తెలంగాణకు ఇవ్వాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
పోలవరంతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని చెప్పారు. భద్రాచలం ముంపుకు గురికాకుండా ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాల్సిన అవసరం ఉందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ముంపు నుంచి రక్షించడానికి కరకట్ట నిర్మించడానికి వీలవుతుందని చెప్పారు. అయితే అలాంటి డిమాండ్ సరైనది కాదని.. పోలవరంతో భద్రాచలానికి ఎలాంటి ముంపు ఉండబోదని ఏపీ మంత్రులు బదులిచ్చారు.
