ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ ఎస్పీ రామకృష్ణా రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా.. ఏపీ మారిటైమ్ బోర్డ్ సీఈవోగా కూడా ఆయన వైదొలిగారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో.. ఆ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 అయితే రాజీనామా వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అలంకారప్రాయంగా బాధ్యతలు నిర్వహించే కంటే వైదొలగడమే ఉత్తమమని ఆయన భావించినట్లు సమాచారం. విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైళ్ల ప్రాజెక్టులను పట్టాలె క్కించేందుకు ఆయన గత ఏడేళ్లుగా ఎంతో తహతహలాడారు. ఎన్నో అధ్యయనాలు చేశారు. విజయవాడకు లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు, విశాఖకు మెట్రో ప్రాజెక్టుకు ఆయన చేతుల మీదుగా డీపీఆర్‌లు రూపొందాయి.

 కానీ వాటిని సాకారం చేసే విషయంలో మాత్రం రామకృష్ణారెడ్డి అశక్తుడిగా మారారు. విజయవాడ లైట్‌ మెట్రోకు డీపీఆర్‌ ఇచ్చి ఏడాదిన్నర కావస్తున్నా.. జగన్‌ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. పోర్టులకు సంబంధించి ఎంతో అనుభవం ఉన్న రామకృష్ణారెడ్డికొ కొంతకాలం కింద మారిటైమ్‌ బోర్డుకు సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా చేశారు. 

ఆయనపైన మరొకరిని ఉన్నతాధికారిగా నియమించారు. వాస్తవానికి రామకృష్ణారెడ్డి ఎప్పుడో పదవీ విరమణ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన్ను ప్రత్యేకంగా అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఎండీగా నియమించారు. ఆ తర్వాత మూడేళ్లు పొడిగించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆయన పదవీకాలాన్ని పొడిగించడం గమనార్హం.