గుంటూరు: కరోనా కారణంగా రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోవుండటంతో సామాన్యులు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టిడిపి నాయకులు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. కానీ వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాత్రం ప్రజలెవ్వరికీ ఇబ్బందులు లేవని అంటున్నాడని... గెస్ట్ హౌస్ లో లాక్ డౌన్ అవ్వడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని బుద్దా మండిపడ్డారు. 

''దేశంలో అందరికి లాక్ డౌన్ కొత్త ఒక్క అంబటి రాంబాబుకి తప్ప. ఎందుకంటే సడన్ గా మాయం అవ్వడం, గెస్ట్ హౌస్ లో లాక్ డౌన్ అవ్వడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ప్రజలకు పెద్దగా ఇబ్బందులు ఉండవు అని ఆయన అనుకుంటున్నాడు'' అని బుద్దా సెటైర్లు విసిరారు.

''ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ ఫెయిల్ అయ్యారు,కరోనా ని కట్టడి చెయ్యడం ఆయన తరం కాదు అందుకే చంద్రబాబు గారు రావాలి అని అంబటి కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది'' అని మండిపడ్డారు. 

''తాడేపల్లి ఇంటికి పరిమితం అయ్యి డాక్టర్లు కూడా కరోనా బారిన పడేలా చెయ్యడం తప్ప జగన్ గారు రాష్ట్రంలో ఉండి చక్కబెట్టిన ఘనకార్యం ఏంటో అంబటి చెప్పాలి.కష్టాల్లో ఉన్న పేద వాడికి 5 వేలు అవసరం లేదు కేంద్రం ఇచ్చిన డబ్బులు మాయం చేసి వెయ్యి ఇచ్చాం అదే ఎక్కువ అని మాట్లాడటం దారుణం'' అని ఆరోపించారు.

''చదవక ముందు కాకరకాయ చదివినాక కీకరకాయ అన్నట్టు ఉంది మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవహారశైలి. కనీస అవగాహన కూడా లేకుండా ఆయన మాట్లాడుతున్న మాటలు విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉండి మెడిటెక్ జోన్ ఏర్పాటు కాకుండా అడ్డుకోవడానికి బ్లూ పత్రికలో అడ్డమైన రాతలు రాయించారు'' అని మండిపడ్డారు.

''మెడ్‌టెక్ జోన్ లో అవినీతి, భూ కబ్జా అంటూ చొక్కాలు చించుకున్నారు వైకాపా నేతలు. వైఎస్ జగన్ గారు మెడ్‌టెక్ జోన్ అడ్డుకోవడానికి అనేక అడ్డదారులు తొక్కారు. మంత్రి గా తాను ఉద్యోగం సంపాదించడం తప్ప ఈ ఏడాదిలో ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు ఒక్క కంపెనీ తెచ్చింది లేదు'' అని విమర్శించారు.

''పైగా బాబు గారు ఏర్పాటు చేసిన మెడ్‌టెక్ జోన్ లో వెంటిలేటర్లు,వ్యక్తిగత రక్షణ కిట్లు తయారు చేస్తున్నాం ఇది జగన్ గారి గొప్పతనం అని చెప్పడానికి సిగ్గుగా లేదా?ఎవరికో పుట్టిన బిడ్డ కి తండ్రి జగన్ గారే అని చెప్పడం మీకు గొప్పగా అనిపిస్తే అలానే కానివ్వండి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు'' అని బుద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు.