అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ విషయంలో ఆయన తన పట్టు వీడడం లేదు. అధికార యంత్రాంగంతో బుధవారం తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ ను ఆయన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ లేఖ నేపథ్యంలో ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు.

ఆ స,మావేశాన్ని ఆయన ఈ రోజు గురువారం నిర్వహించడానికి సిద్ధపడ్డారు. అధికార యంత్రాంగంతో గురువారం సమావేశం నిర్వహిస్తానంటూ ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించడానికి గురువారం ఉదయం 10-12 గంటల మధ్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని ఆయన ఆ లేఖలో చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు సమావేశంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన ఆ లేఖలో సీఎస్ కు సూచించారు. 

ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్ల కోసం చర్చించడానికి బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 5 ంగటల మధ్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం సంబంధిత అధికారులకు లేఖలు రాశారు. 

అయితే, ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని నీలం సాహ్నీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. దానిపై తీవ్ర అబ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అయితే, బుధవారం పరుస పరిణామాల నేపథ్యంలో ఆయన అధికార యంత్రాంగంతో సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. తన ఛేంబర్ కు మాత్రమే పరిమితమయ్యారు. 

ఎస్ఈసీ  కార్యదర్శి వాణీమోహని్ సాయంత్రం 3 గంటల వరకు కార్యాలయంలోనే ఉండి ఆ తర్వాత వెళ్లిపోయారు. అంతకు ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. మొత్తం మీద, వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయన పోరాటానికే సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.