Asianet News TeluguAsianet News Telugu

పవన్ తీరుపై ఆంధ్రా జర్నలిస్టులు ఫైర్

మీడియా పట్ల పవన్ కళ్యాణ్ తీరుపై ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం స్పందించింది

ap journalists serious on pavan kalyan

అమరావతి :

మీడియా పట్ల పవన్ కళ్యాణ్ తీరుపై ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం స్పందించింది. పవన్ తీరును ఫోరం తీవ్రంగా ఖండించింది . ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన యదావిదిగా కింద ఇస్తున్నాం..

ఎవరో యువతి పవన్ కళ్యాణ్ తల్లిని ధూషించిందని ఆ వార్తలు చానెళ్లలో కవర్ చేశారని ఆగ్రహం తో ఊగిపోతూ చానెళ్లను శాసించాలని చూడటం మంచి పద్దతి కాదు. వాస్తవానికి మీ తల్లిని శ్రీరెడ్డి తిట్టిన తిట్టును ఏ చానెల్ కూడా సంస్కారంతో  ప్రసారం చేయలేదు. కానీ మీరు మాత్రం మీడియాలో మీ తల్లిని ధూషించింది ప్రసారం చేసినట్టు భ్రమించి ఆరోపణలు చేస్తున్నారు. మీడియా ఎలా ఉండాలో ఏ వార్తలు ప్రసారం  చేయాలో మీరు డిసైడ్ చేయొద్దు. చానెళ్లలో ఏ కంటెంట్ ఇవ్వాలో మీరెలా డిక్టేట్ చేస్తారు? మీరు తీసే సినిమాలు ఎలా ఉండాలో మీడియా స్క్రిప్ట్ చూసి బావుందని చెబితే మీరు యాక్ట్ చేస్తారా? మీ సినిమాలు ఎలా ఉండాలో మేము చెప్పడం లేదు కదా .. మీరు పెట్టిన రాజకీయ పార్టీ ఎలా నడవాలో మేము చెప్పడం లేదు కదా .. జర్నలిజం ను మీరు శాసించడానికి ప్రయత్నించవద్దు.

 అంతేగానీ చానెల్స్ పై దాడి చేయడం తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నామని చెప్పుకుంటున్న మీరు విమర్శలు ఆరోపణలు కూడా స్వీకరించడానికి సిద్దంగా ఉండాలి. అంతేగానీ భౌతిక దాడులు చేయడం మీ పార్టీ సిద్దంతమా? తల్లిని ధూషించారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మీరు ఇవాళ ఫిల్మ్ చాంబర్ దగ్గర ఒక మహిళా జర్నలిస్ట్ పై మీ అభిమానుల దాడిని సమర్ధిస్తున్నారా? మీడియా ప్రతినిధులను చంపుతాము ..యాసిడ్ దాడులు చేస్తామంటూ మీ జనసైన్యం బెదిరిస్తోంది దీనికి నైతిక బాధ్యత వహిస్తారా? జనసేన పార్టీ ఇంకా ఉనికిలో లేకముందే మీరు మీడియాను బెదిరిస్తున్నారు. మీ అనుచరుల చేత దాడులు చేయిస్తున్నారు. మీ చెప్పుచేతల్లో మీడియాను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవాళ మీ ఆధ్వర్యంలోనే మీ అభిమానులు ఏబీఎన్ వాహనాన్ని ధ్వంసం చేయడం , మిగిలిన మీడియా ప్రతినిధులను బెదిరించడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి.

టీవీ9 , ఏబీఎన్ , టీవీ 5 చానెళ్లను బ్యాన్ చేయాలని చెప్పడం ద్వారా మీరు మీ కార్యకర్తలకి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? మహా టీవీ పై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ చానెల్ కి యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేయడం సరికాదు . గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ తో ఎందరో మహిళలు వారి ఆవేదనను మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమైన సంఘటనలు మీకు కనిపించలేదా? సినిమా చాన్సులు ఇస్తామంటూ మైనర్ బాలికలను సైతం వదలకుండా లైంగిక దోపిడీకి పాల్పడితే సినిమా ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్న మీరు గానీ మీ కుటుంబ సభ్యులుగానీ ఎందుకు స్పందించలేదు. అదేమంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సలహా ఇచ్చిన మీరు మీ తల్లిగారి విషయంలో మరో మహిళ మీ తల్లిని తిట్టిందని ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదు ? మీడియా పట్ల అభ్యంతరాలుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చన్న జ్ఞానం మీకెందుకు కలగలేదు? మీకొచ్చిన కష్టం యావత్తు రాష్ట్ర ప్రజలకు వచ్చిన కష్టం లాగా చిత్రీకరిస్తూ మీ అభిమానులను రెచ్చగొడాతారా? ఇదెంత వరకూ సమంజసమో పార్టీ అధ్యక్షుడిగా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము

                 ఇట్లు .. అంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు , చెవుల క్రిష్ణాంజనేయులు

Follow Us:
Download App:
  • android
  • ios