నెల్లూరు: మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన కొడుక్కి మాత్రమే జాబ్ ఇచ్చారని విమర్శించారు. ఏనాడు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. 

నెల్లూరు జిల్లాలో గ్రామ సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ సీఎం అయిన తర్వాత లక్షలాది మంది తమ్ముళ్లకు, చెల్లెల్లకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రశంసించారు. 

మూడు నెలల్లోనే లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన  ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కే దక్కుతుందని తెలిపారు. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉండటం గర్వంగా ఉందన్నారు. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడం పట్ల కొంతమంది ఓర్వలేక సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలపై దుష్ఫ్రచారం చేస్తున్నారని అనిల్ కుమార్  మండిపడ్డారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. సచివాలయ, వార్డు ఉద్యోగులు నిజాయతీగా బాధ్యతలు నిర్వర్తించి ప్రజలకు సేవాలందించాలని కోరారు.  

వైయస్ఆర్ కుటుంబానికి మాట తప్పడం మడమ తిప్పడం తెలియదని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఆనాడు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మాట తప్పకుండా మడమ తిప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వైయస్ జగన్ కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగలు ఇచ్చారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.