విదేశీ అతిధులకు చంద్రబాబునాయుడు పార్టీ ఏర్పాట్లు చూశారా? అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. చంద్రబాబేంటి? విదేశీ అతిధులకు పార్టీ ఏర్పాట్లు చూసుకోవటం ఏంటనుంటున్నారా? అవునండి నిజంగానే జరిగింది. విషయం ఏమిటంటే, విశాఖపట్నంలో రెండు రోజులుగా పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది కదా? అందులో ఆదివారం రాత్రి విదేశీయుల కోసం ప్రభుత్వం గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసింది. ఉడా పార్కుకు సమీపంలోని ఎంజిఎం పార్కులో బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేసింది.

దేశ, విదేశీ అతిధులు హాజరైన ఆ పార్టీకి చంద్రబాబు కూడా హాజరయ్యారు. హాజరవ్వటమే కాకుండా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చూసుకున్నారు. పై చిత్రం అందులో భాగమే లేండి. ఆంధ్రప్రదేశ్‌లో పెటుబడుల సంగతి ఏమోకానీ.. సీఐఐ సదస్సలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీగానే ఖర్చుపెడుతోంది. పెట్టుబడులను ఆకర్శించడానికి జరగాల్సిన సమావేశం విందులు, వినోదాలకు వేదికగా నిలిచింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఈ విందులో అతిథులను ఆకట్టుకోవడానికి బాలీవుడ్‌ నుంచి నృత్యకారిణులు, పాప్‌ గాయకులను పిలిపించారు. అంతేకాదు వీటితో పాటు పలు విలాసవంతమైన ఏర్పాట్లను చేశారు. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ఇప్పటికి రెండు సదస్సులు నిర్వహించిన ప్రభుత్వం ఏ మేరకు పెట్టుబడులు సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సమావేశాల్లో ఏపీకీ ఎంత మేరకు పెట్టుబడులు వస్తాయో తెలీదు. సదస్సుల పేరుతో ప్రజాధనాన్ని మాత్రం యధేచ్ఛగా ఖర్చైపోతోంది.