అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయంటూ మాజీమంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలే దాడులకు పాల్పడుతూ నిందను వైసీపీపై మోపుతూ తమపై లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైఎస్సార్‌ సీపీ దాడులు చేస్తోందని, తమ పార్టీ కేడర్‌ సహనాన్ని పరీక్షించవద్దంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. లోకేష్ ట్వీట్ పై హోంమంత్రి సుచరిత ఘాటుగా స్పందించారు. 

ఇటీవల జరిగిన దాడుల్లో టీడీపీ వాళ్లు 44మంది గాయపడితే వైసీపీ నేతలు 57మంది గాయపడ్డారని చెప్పుకొచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ముఖ్యమంత్రి ఎప్పుడో చెప్పారని అందువల్ల గట్టి భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. అయినా టీడీపీ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తోందని ఇది సరికాదన్నారు. 

ఘర్షణల్లో వైసీపీకి చెందినవారే అధికంగా గాయపడ్డారని చెప్పుకొచ్చారు. ఉనికి కోల్పోతున్నామన్న భయంతో టీడీపీ వాళ్లు దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. గతంలో మహిళా అధికారిని కొట్టినా పట్టించికోని పరిస్థితి ఉండేదికాదని, అన్యాయాన్ని నిలదీసిన ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారంటూ విరుచుకుపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదంటూ హోం మంత్రి మేకతోటి సుచరిత కౌంటర్ ఇచ్చారు.