ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ వైస్సార్ చేయూత కార్యక్రమం ప్రారంభించారన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... 23 లక్షల మంది మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు.

ఆముల్, రిలియన్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్దికంగా స్థిరపడ వచ్చని సుచరిత ఆశాభావం వ్యక్తం చేశారు. వైస్సార్ చేయూత పథకంపై  టీడీపీ నేతలు విమర్శలు చేయడం తగదని, మహిళను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని హోంమంత్రి ఆరోపించారు.

డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళను మోసం చేశారని... అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో జగన్ మూడవ స్థానం సాధించడం రాష్ట్రానికి గౌరవప్రదంగా భావిస్తున్నామని సుచరిత చెప్పారు.

ఇచ్చిన హామీల్లో దాదాపు 90 శాతం పైగానే  సీఎం అమలు చేశారని... డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో చెల్లించనున్నారని హోంమంత్రి తెలిపారు. ప్రతి మహిళను లక్షలాదికారిని చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని ఆమె గుర్తుచేశారు.

మహిళలకు పావలా వడ్డీకే వైఎస్ రుణం ఇచ్చారని వెల్లడించారు. జగన్ మహిళా పక్షపాతి అని.. అమ్మఒడి, చేయూత ద్వారా  మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. నామినేషన్ పదవులు, పనుల్లో 50 శాతం అవకాశం మహిళలకే కల్పించారని, మహిళలు ఆర్దికంగా స్థిరపడ్డడం కోసం సీఎం అనేక నిర్ణయాలు తీసుకున్నారని సుచరిత చెప్పారు.

30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని, మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. జగన్ ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తున్నారని... ఉనికి కోల్పోతామనే భయంతో టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా టీడీపీ అమలు చేయలేదని... దళితులపై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం తక్షణం స్పందిస్తోందని సుచరిత స్పష్టం చేశారు. దళితుల దాడి చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్నామని.. టీడీపీ కుల రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన, మంచి పాలన ఉందని దేశం మొత్తం కొనియాడుతోందని హోంమంత్రి తెలిపారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, మోకా హత్య కేసులో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసినప్పుడు బీసీలపై దాడులంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేశారని.. ఇప్పుడు దళితులకు అన్యాయమంటూ గగ్గోలు పెడుతున్నారని సుచరిత దుయ్యబట్టారు.

టీడీపీ నేతలు కుల రాజకీయాలు చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని సుచరిత ఆరోపించారు. చీరాల యువకుడి మరణానికి, శిరోముండనం చేసిన అధికారులను సస్పెండ్ చేశామని ఆమె గుర్తుచేశారు.