మాజీ మంత్రిపై చినరాజప్ప వివాదాస్పద వ్యాఖ్యలు

ap home minister nimamakayala chinarajappa sensational comments on ex minister
Highlights

టీడీపీలో కలకలం..చంద్రబాబుకి కొత్త తలనొప్పి

హోంశాఖ మంత్రి చినరాజప్ప.. చంద్రబాబుకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఇప్పటికే నానా సమస్యలతో సతమతమౌతున్న చంద్రబాబుకి మరో చిక్కు వచ్చిపడింది. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చినరాజప్ప మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ రావు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీలోని ఆయన మద్దతు దారులు చినరాజప్పపై మండిపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే...
ఓ టీవీ ఛానెల్ తో చినరాజప్ప మాట్లాడుతూ... ‘‘నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకడు ఉన్నాడు...మరొకడు వెళ్లిపోయాడు.’’ అని అన్నారు. ఆ ఇద్దరు శత్రువులు ఎవరనే ప్రశ్నకు రాజప్ప ఠక్కున సమాధానమిస్తూ ‘ఇంకెవరు బొడ్డు భాస్కర రామారావు, రెండో వ్యక్తి ‘మెట్ల సత్యనారాయణ రావు’ అని చెప్పారు. అందరూ పెద్ద మనిషిగా గౌరవించే డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావును రాజప్ప ఒకడు వెళ్లిపోయాడని ఏకవచనంలో మాట్లాడడంతో అమలాపురం నియోజకవర్గంలోనే కోనసీమ టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో కలకలం రేపింది. ఇప్పుడా వ్యాఖ్యలు దావనంలా వ్యాపించాయి. ముఖ్యంగా మెట్ల సత్యనారాయణను అభిమానించే నాయకులంతా మనస్తాపానికి గురయ్యారు. సోమవారం రాత్రి...మంగళవారం ఉదయం పట్టణంలోని డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు తనయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌ మెట్ల రమణబాబు స్వగృహంలో టీడీపీ నాయకులంతా సమావేశమయ్యారు. రాజప్ప వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మనస్తాపానికి గురవడమే కాకుండా రాజప్పపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

 దివంగత డాక్టర్‌ మెట్ల అనుచరులు, టీడీపీ నాయకులైన మున్సిపల్‌ చైర్మన్‌ చిక్కాల గణేష్,  పట్టణ టీడీపీ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ, మున్సిపల్‌ కౌన్సిల్‌ విప్‌ నల్లా స్వామి, మార్కెటింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, దాదాపు 20 మంది టీడీపీ మున్సిపల్‌ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఇందులో కొందరు మాట్లాడుతూ... పట్టణంలో టీడీపీ కార్యక్రమాల్లో మనమంతా దూరంగా ఉండాలని మాట్లాడగా...మరికొందరు రోడ్డెక్కి దిష్టిబొమ్మల దహనం తదితర రూపంలో ఆందోళన చేద్దామని...మరికొందరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబును దృష్టికి తీసుకుని వెళ్లాలన్నారు. ఇంకొందరు అమలాపురంలో రాజప్ప పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. 

అంతేకాదు.. పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరావునుద్దేశించి మాట్లాడటంతో ఇక్కడ టీడీపీలో ఉన్న బొడ్డు వర్గీయులంతా గుర్రుగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బొడ్డు, రాజప్ప మధ్య విభేదాలున్నప్పటికీ ఇలా బాహాటంగా రోడ్డెక్కడం టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

loader