అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాల్ మనీ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. 

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కాల్ మనీ కేసులపై ఆమె క్లారిటీ ఇచ్చారు. కాల్‌మనీ కేసుల్లో మొత్తం రూ. 700 కోట్ల వ్యాపారం జరిగిందని  తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కాల్ మనీ కేసులు నమోదు అయినట్లు తెలిపారు.  

విజయవాడలో 14, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, కడపలో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు. అత్యధికంగా కృష్ణాజిల్లాలో కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 30 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 

30 మంది కాల్ మనీ నిందితుల్లో ఏడుగురిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాల్ మనీ కేసులపై పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్ మనీ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తాము మాత్రం వదిలిపెట్టేది లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.