అమరావతి: జడ్జిలను దూషించిన కేసును ఏపీ హైకోర్టు విచారించింది. ఈ క్రమంలో హైకోర్టుతో పాటు ఇతర కోర్టుల జడ్జిలను దూషించిన కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ నివేదిక  న్యాయస్థానానికి సమర్పించింది. 

జడ్జిలను దూషించిన వారిపై ఎఫ్‍ఐఆర్ నమోదు చేశామని సిబిఐ తెలిపింది. అయితే ఈ కేసులో నిందుతులు వివిధ దేశాల్లో ఉన్నందున వారిని విచారించేందుకు 4 నెలల సమయం పడుతుందని... అంతవరకు సమయం ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం విచారణ వచ్చే ఏడాది మార్చి 31కి వాయిదా వేసింది. 

Read more   జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు: ఎంపీ సురేష్ సహా 49 మందికి హైకోర్టు నోటీసులు

 జడ్జిలను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టడంపై సీరియస్ అయిన హైకోర్టు దీనిపై జరపాల్సిందిగా సిబిఐని ఆదేశించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే హైకోర్టు జడ్జిలపై, కోర్టు తీర్పులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై హైకోర్టు జడ్జికి లేఖ రాసిన న్యాయవాది లక్ష్మీనారాయణ సీబీఐ అధికారులు విచారించారు.

 సీబీఐ అధికారులకు  న్యాయవాది లక్ష్మీనారాయణ తన వద్ద ఉన్న ఆధారాలను అందించారు. ఈ విషయమై ఇప్పటికే సీఐడీ నమోదు చేసిన కేసులన్నీ ఒక్క కేసుగా సీబీఐ నమోదు చేసింది. సీఐడీ నమోదు చేసిన కేసులను ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకొంది.  

హైకోర్టు తీర్పులపై వైసీపీకి చెందిన కొందరు నేతలు, ప్రజా ప్రతినిధులు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలపై దాఖలైన పిల్ పై ఏపీ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. సీఐడీ దర్యాప్తునకు బదులుగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.  ఈ విషయమై సీబీఐ కేసులు నమోదు చేసింది.  ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ప్రారంభించింది.