ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మార్ఫిండ్ వీడియోలను ప్రదర్శించారన్న అభియోగంపై సీఐడీ విచారణను ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది.

సీఐడీ విచారణకు హాజరుకావాలని ఉమను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు మంగళగిరి సీఐడీ ఆఫీసులో విచారణ జరగనుంది. తదుపరి విచారణను మే 7కి వాయిదా వేసింది హైకోర్టు. 

సీఎం జగన్‌ వీడియో మార్ఫింగ్ కేసులో కర్నూలు సీఐడీ పోలీసులు ఆయనపై చీటింగ్‌ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేశారు. ఇక ఉమా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Also Read:జగన్ మార్ఫింగ్ వీడియో కేసు: ఇంటికి సిఐడి పోలీసులు, అజ్ఞాతంలోకి దేవినేని ఉమా

దేవినేని ఉమా కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు బుధవారం సాయంత్రం ఆయన ట్విస్ట్ ఇచ్చారు. తనకు సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసులపై దేవినేని ఉమా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

తనను అరెస్ట్‌ చేసేందుకు సీఐడీ ప్రయత్నిస్తోందని, సీఐడీ నోటీసులను రద్దు చేయాలని పిటిషన్‌లో ఉమా కోరారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం పై విధంగా తీర్పు వెలువరించింది.