జగన్ మార్ఫింగ్ వీడియో కేసు: ఇంటికి సిఐడి పోలీసులు, అజ్ఞాతంలోకి దేవినేని ఉమా
టీడీడీపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అజ్ఞాతంలోకి వెళ్లారు. వైెఎస్ జగన్ వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణపై నమోదైన కేసులో సీఐడి అదికారులు దేవినేని ఉమా నివాసానికి చేరుకున్నారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్ఫింగ్ వీడియోను ప్రదర్శించి, తప్పుడు ఆరోపణలు చేశారనే ఆరోపణపై దేవినేని ఉమాపై కేసు నమోదైంది.
కర్నూలుకు చెందిన నారాయణ రెడ్డి దేవినేని ఉమాపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ నెల 10వ తేదీన ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీన విచారణ నిమిత్తం కర్నూలు సిఐడి కార్యాలయానికి రావాలని ఉమాకు నోటీసులు ఇచ్చారు. అయితే, విచారణకు ఉమా హాజరు కాలేదు.
ఆ తర్వాత విచారణ నిమిత్తం 19వ తేదీన హాజరు కావాలని రెండో నోటీసు ఇచ్చారు. ఆ నోటీసును కూడా బేఖాతరు చేస్తూ దేవినేని ఉమా విచారణకు హాజరు కాలేదు. దీంతో సిఐడి అధికారులు మంగళవారం దేవినేని ఉమా నివాసానికి వచ్చారు. రెండు రోజులుగా దేవినేని ఉమా మహేశ్వర రావు మొబైల్ స్విచాఫ్ అయి ఉంది.
సీఐడి అధికారులు ఇంట్లోని కుటుంబ సభ్యులను దేవినేని ఉమా గురించి ప్రశ్నించారు. అయితే, దేవినేని ఉమా ఇంట్లో లేరని వారు చెప్పారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారని, ఎక్కడికి వెళ్లారో తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.