ఆర్జిత సెలవుల (ఈఎల్)పై విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసుకున్న దరఖాస్తుపై జూన్ 30వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని సీఎస్, డీజీలను హైకోర్టు ఆదేశించింది.
అమరావతి: ఆర్జిత సెలవుల (ఈఎల్)పై విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసుకున్న దరఖాస్తుపై జూన్ 30వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, (సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 21 రోజుల కంటే ముందు దరఖాస్తు సమర్పించినప్పుడు ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఏబీ దరఖాస్తుపై ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది.
వివరాలు.. ఏబీ వెంకటేశ్వరరావు జూన్ 6న విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన ఆర్జిత సెలవుల (ఈఎల్) ఆమోదం కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన దరఖాస్తుపై డీజీపీ గానీ, సీఎస్ గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే తన దరఖాస్తుపై సీఎస్, డీజీపీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏబీ వెంకటేశ్వరరావు తరఫున లాయర్ బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం విదేశాలకు వెళ్లడానికి వచ్చిన దరఖాస్తును 21 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉందని ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. 21 రోజుల్లోగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లేనని అన్నారు. 21 రోజుల గడువు ముగిసినందున ఇప్పుడు ఎలాంటి అనుమతి అవసరం లేదని ఆదినారాయణరావు తెలిపారు. ఈఎల్స్‌పై విదేశాలకు వెళ్లేందుకు చట్టప్రకారం ఎలాంటి నిషేధమూ లేదని చెప్పారు. డీజీపీ ర్యాంక్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పిటిషనర్ ఈఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని.. దానిని పెండింగ్‌లో ఉంచారని తెలిపారు.
రాష్ట్ర హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ సస్పెన్షన్‌లో ఉన్నారని, ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుపై విచారణ పెండింగ్‌లో ఉందని చెప్పారు. అనుమతి ఇవ్వాలా? లేదా అనేది అధికారుల విచక్షణాధికారమని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్.. పిటిషనర్ సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ, ఆర్జిత సెలవుపై విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టం చేశారు. అతని విదేశీ ప్రయాణంపై నిషేధం లేనప్పుడు, అతని దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కోర్టు పేర్కొంది. జూన్ 30లోగా రావు దరఖాస్తుపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సీఎస్, డీజీపీలను హైకోర్టు ఆదేశించింది.
