అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్.. చంద్రబాబు బెయిల్ పిటిషన్, రేపు విచారించనున్న హైకోర్ట్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై రేపు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది . ఈ వ్యవహారంలో టీడీపీ అధినేతను ఏ1గా చేర్చారు పోలీసులు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై రేపు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌లో చోటు చేసుకున్న అక్రమాలపై 2022లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో టీడీపీ అధినేతను ఏ1గా చేర్చారు పోలీసులు. ఈ క్రమంలో చంద్రబాబు న్యాయవాదులు ఈ కేసులో బెయిల్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను రేపు హైకోర్టు విచారించనుంది.
ఇదిలావుండగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఆయన కీలకాంశాలను ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండా అరెస్టు చేశారని ఆరోపించారు. 2022లో బాబు పేరు బయటికి వచ్చిందని.. కానీ 2023 సెప్టెంబర్ 8న అరెస్ట్ చేయాలనీ భావించి ఆయనను అదుపులోకి తీసుకున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో పెట్టిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు.
చంద్రబాబుపై చేసిన ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని.. ఒక తప్పుడు క్రిమినల్ కేసులో ఆయనను ఇరికించారని శ్రీనివాస్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేసేందుకు గ్రౌండ్స్‌ను ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. సిఐడికి వచ్చిన ఫిర్యాదులో చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణ లేదని శ్రీనివాస్ తెలిపారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును ఇరికించారని.. ఆయన నేరం చేశారనడానికి సిఐడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఆధారాలు సేకరించడంలో సిఐడి విఫలమైందని ఆయన దుయ్యబట్టారు.
ఎలాంటి ఆధారాలు లేకుండానే బాబును నిందితుడిగా చేర్చారని.. సెక్షన్ 409 పెట్టారని, కానీ 409పై ఎలాంటి ఆధారాలు సిఐడి చూపలేకపోయిందన్నారు. 409 తప్ప మిగతా సెక్షన్లన్నీ ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేవేనని దమ్మాలపాటి తెలిపారు. పలువురు నిందితుల వాంగ్మూలాలు తప్ప ఎలాంటి ఆధారాలు సిఐడి సేకరించలేదన్నారు. అరెస్టు సమయంలో సీఆర్‌పీసీ 50ను పోలీసులు ఫాలో కాలేదని శ్రీనివాస్ చెప్పారు. క్రైమ్ నెంబర్‌తో పాటు, ఎఫ్ఐఆర్ సెక్షన్లు తప్ప ఎలాంటి సమాచారాన్ని పోలీసులు చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.