ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగేలా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇక, రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోను సవాలు చేస్తూ సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మరికొందరు కూడా ఇదే జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై చారణ సందర్బంగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఈ పిటిషన్లపై లోతైన విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, డీవీఎస్‌ఎస్ సోమజాయులతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వర్ చేసింది. తాజాగా తీర్పును వెలువరించింది.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభలలో తొక్కిసలాట ఘటనలతో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసు చట్టం, 1861 కింద జనవరి 2వ తేదీన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించింది.
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, వాటి నిర్వహణలో లోటుపాట్ల నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ జీవోపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వం జీవో నెంబర్ 1ను కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే తీసుకొచ్చిందని మండిపడ్డాయి.
