ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ ఎన్నికలను హైకోర్టు నిలిపివేసింది. ఓటర్ల జాబితాకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. 

వార్డుల పునర్విభజన, జనగణన సరిగా లేదంటూ కోర్టులో వాదనలు వినిపించారు న్యాయవాది వెంకటేశ్వరరావు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.  

అంతకుముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. గతేడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియలో బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని జనసేన కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

ఈ నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్‌ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపి తుది తీర్పును రిజర్వులో ఉంచింది.