నిబంధనలను పాటించకుండానే శ్రీశైలం ఆలయ పాలకమండలిని నియమించారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సభ్యుల ప్రమాణస్వీకాార కార్యాక్రమంపై స్టే విధించింది. 

అమరావతి: ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయానికి ఇటీవలే నూతన ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నూతన బోర్డు సభ్యులు ఫిబ్రవరి 14వ తేదిన ప్రమాణస్వీకారం చేయాల్సివుండగా హైకోర్టు ఆదేశాలతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. దేవాలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ప్రమాణస్వీకారంపై న్యాయస్థానం స్టే విధించింది.

శ్రీశైలం ట్రస్ట్ బోర్డు (srisailam trust board) సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్ హైకోర్టును ఆశ్రయించాడు. దేవాలయ పాలకమండలిలో గిరిజనులకు ప్రాతిధ్యం లేదని... ప్రభుత్వం నిబంధనలను పాటించకుండానే బోర్డ్ సభ్యులను నియమించిందని స్థానిక గిరిజనుడైన శ్రీనివాసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది.

గిరిజన నేపథ్యం కలిగిన ఆలయ పాలకమండలిలో వారికి ప్రాతినిధ్యం కల్పించకపోవడంం ఏమిటని పిటిషనర్ తరపు న్యాయవాది వేణుగోపాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం పాలకమండలిలో ఇద్దరు హిందూ ధార్మిక తాత్వికవెత్తలకు చోటు కల్పించాలని... కానీ ప్రస్తుత బోర్డులో అలాంటివారు లేరని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఎస్టీ సభ్యునికి రిజర్వేషన్ అమలు చేయలేదని పేర్కొన్నారు. 

పిటిషనర్ తరపు న్యాయవాది వాదన విన్న హైకోర్టు ప్రమాణస్వీకారం జరపకుండా వాయిదా వేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల వరకు ప్రమాణస్వీకారం చేయించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

ఇదిలావుంటే ఈ శ్రీశైలం ఆలయ పాలకమండలి నియామకం అధికార వైసిపిలోనూ అలజడి రేపింది. బోర్డ్ ఛైర్మన్ గా ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థివర్గానికి చెందిన చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమించారు. దీంతో రోజా పార్టీ అధినాయకత్వం, ప్రభుత్వంపై గుర్రుగా వున్నట్లు సమాచారం. 

తనను ఓడించడానికి ప్రయత్నించడమే కాదు గత స్థానికసంస్థల ఎన్నికల్లో చక్రపాణి రెడ్డి పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించాడని రోజా ఆరోపిస్తున్నారు. అలాంటిది అతడికి పదవి ఇవ్వడంపై రోజా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతానని రోజా తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే రాజీనామాకు కూడా సిద్దమేనని రోజా అన్నారు.