గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మిస్తున్న బాప్తిజం ఘాట్ నిర్మాణ పనులపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మిస్తున్న బాప్తిజం ఘాట్ నిర్మాణ పనులపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. బాప్టిజం ఘాట్ నిర్మాణానికి వ్యతిరేకంగా బీజేపీతో పాలు పలు హిందూ సంఘాలు ఆందోళనకు కూడా దిగాయి. దీంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. ఈ క్రమంలోనే వివాదం హైకోర్టుకు చేరింది. బాప్టిజం ఘాట్ నిర్మాణ ప్రాంతం రెవెన్యూ డొంకా భూమిగా ఉందని లాయర్ ఇంద్రనీల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. మంగళగిరిలో బాప్టిజం ఘాట్ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న బాప్టిజం ఘాట్ నిలిపివేయాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇక, బాప్టిజం ఘాట్‌ను నిరసన సమయంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటు బ్యాంకు పెంచుకునేందుకు మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బాప్టిజం ఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం స్థలం ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ ఘాట్ మత మార్పిడి కోసం కాదని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు చెప్పారు. క్రైస్తవ సంప్రదాయాల్లో భాగంగా పుణ్యస్నానాలను ఆచరించేందుకు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
