అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ఆదేశాలను అపహాస్యం చేస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

వెదురుకుప్పం మండలం తిరుమలాయపల్లిలో సచివాలయం కట్టొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఇదే స్థలంలో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కేంద్ర నిర్మాణాన్ని రెవిన్యూ, పంచాయితీ అధికారులు చేపట్టారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

తమ ఆదేశాలను అపహాస్యం చేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 215 ప్రకారంగా సుమోటోగా తీసుకొని అధికారులపై చర్యలు తీసుకొంటామని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు తమ ఆదేశాలను పట్టించుకోని అధికారులను జైలుకు పంపుతామని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

గతంలో కూడ పలు అంశాలపై ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఏపీ హైకోర్టు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను తప్పుబట్టడాన్ని విపక్షాలు వైసీపీ నేతలకు తరచూ గుర్తు చేస్తుంటారు.తాజాగా ఇవాళ కూడ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.