జడ్జిల మీద ట్రోలింగ్‌పై క్రిమినల్ కంటెంప్ట్.. బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు..
చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు న్యాయమూర్తులను కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు న్యాయమూర్తులను కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో నేడు విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. కొంతమంది జడ్జిలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. జడ్జిలపై దూషణలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని అన్నారు. అయితే న్యాయమూర్తులపై పలువురు చేసిన ట్రోల్స్‌ను హైకోర్టు తీవ్రంగా ఖండించింది.
ఈ క్రమంలోనే ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్న 26 మందికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ జాబితాలో టీడీపీ నేత బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. ట్రోల్ చేసినవారి సోషల్ మీడియాల ఖాతాను పరిశీలించి నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.