అమరావతి: కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో 50% బకాయి పడిన జీతాలు,పెన్షన్లను 12% వడ్డీతో చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఓ రిటైర్డ్ హైకోర్టు జడ్జి  వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పుని వెలువరించింది. 

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ మాసాల్లో ప్రభుత్వోద్యుగులకు సగం జీతాలను అందించింది ఏపీ ప్రభుత్వం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్య సిబ్బంది, పోలీసులకు పూర్తి వేతనం చెల్లించింది. మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలుత సగం వేతనాన్ని చెల్లించిన ప్రభుత్వం నిధులు సమకూరిన తర్వాత మిగిలిన వేతనాన్ని చెల్లించింది. ఇదే తరహాలోనే ఏప్రిల్ మాసంలో కూడ వేతనాలను చెల్లించింది. 

read more   పాత వాటికి కొనసాగింపే.. కొత్తది కాదు: రాయలసీమ ఎత్తిపోతలపై షెకావత్‌కు జగన్ లేఖ

అయితే మార్చిలో పెన్షనర్లకు సగం పెన్షన్ మాత్రమే చెల్లించగా ఏప్రిల్ లో మాత్రం వారికి పూర్తి స్థాయిలో పెన్షన్ అందించింది. పెన్షనర్ల నుండి వచ్చిన వినతి మేరకు సగం పెన్షన్ కు బదులుగా పూర్తి స్థాయి పెన్షన్ ను చెల్లించింది ప్రభుత్వం. 

తెలంగాణ ప్రభుత్వం కూడా మార్చి నెలలో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పెన్షనర్ల వేతనాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. కరోనా విధుల్లో ఉద్యోగులకు మాత్రం పూర్తి వేతనాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించింది.