అమరావతి:డాక్టర్ రమేష్ కుమార్ తో పాటు ఆసుపత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంలో కేసులో డాక్టర్ రమేష్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై మంగళవారం నాడు ఏపీ హైకోర్టు విచారణ చేసింది. తన అరెస్ట్ చేయకుండా స్టే కోరుతూ డాక్టర్ రమేష్ హైకోర్టును ఆశ్రయించారు.

రమేశ్ ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్ విషయంలో తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశించింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. రమేష్ హాస్పిటల్ పై ఫైల్ చేసిన ఎఫ్ ఐ ఆర్ పై హైకోర్టు స్టే విధించింది. 

ఏళ్ల తరబడి హోటల్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. హోటల్ లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులు అనుమతిచ్చిన విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

also read:అవసరమైతే హీరో రామ్ కి కూడ నోటీసులు: విజయవాడ పోలీసులు

స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ కు అనుమతి ఇచ్చిన జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి కూడ ప్రమాదానికి బాధ్యులే కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో అధికారులనూ నిందితులుగా చేరుస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

ఈ కేసులో డాక్టర్ రమేష్ ను అరెస్ట్ చేయకుండా ఉంటారా... తామే ఉత్తర్వులు ఇవ్వాలా అని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది జోక్యం చేసుకొని  కేసు ఇంకా విచారణ దశలో ఉందని హైకోర్టుకు వివరించారు.