అమరావతి: కంపెనీ అత్యవసర పనుల కోసం 30 మందిని  విధులు నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ ఎల్జీ పాలిమర్స్ సంస్ధ హైకోర్టును ఆశ్రయించింది.  అయితే ఈ పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి వేరే బెంచ్‌ను ఏర్పాటు చేస్తారని హైకోర్టును తెలిపింది. అప్పటివరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. 

గతంలో గ్యాస్ లీక్ దుర్ఘటన విషయంలో హైకోర్టు ఆదేశాలతో విశాఖ జిల్లా యంత్రాంగం కదిలింది. విషవాయువులు చిమ్మిన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను సీజ్ చేసింది. మరోవైపు ఈ ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయంటున్న ప్రతిపక్షం జ్యుడీషియల్ విచారణ కోసం పట్టుబడుతోంది. విషవాయువులు చిమ్మి 12మంది ప్రాణాలు బలితీసుకున్న ఎల్జీ పాలిమర్ కంపెనీని శాశ్వతంగా తరలించాలన్న బాధితుల డిమాండ్ నెరవేరే దిశగా తొలి అడుగుపడింది. స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటనను సుమోటో గా తీసుకుని విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కర్మాగారం మూసివేయాలని నిర్ధేశించింది.

విచారణ కోసం నియమించిన బృందాలు తప్ప ఇతరులు ఎవరు ఫ్యాక్టరీ లోపలికి  ప్రవేశించడానికి వీల్లేదని స్పష్టం చేసింది న్యాయస్థానం. అలాగే, స్థిర,చర ఆస్తులను తమ ఆదేశం లేకుండా తరలించవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు అందడంతో జిల్లా యంత్రాంగం హుటాహుటిన కదిలింది. ఎల్జీ పాలిమర్ సంస్థ ను సీజ్ చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన బృందాలు మొత్తానికి కంపెనీని సీజ్ చేశాయి.

read more  విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన... నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు

అయితే అత్యవసర పనుల కోసం కంపెనీలోకి కొందరిని అనుమతించాలని కోరుతూ ఎల్జీ పాలిమర్స్ హైకోర్టును విజ్ఞప్తి చేస్తూ ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన విచారణ జరిపిన న్యాయస్థానం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతవరకు విచారణను వాయిదా వేసింది. 

నిజానికి ఎల్జీ పాలిమర్ కంపెనీ ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 14వేల టన్నుల స్టైరిన్  నిల్వలను తరలించుకుపోవాలని ఎల్జీ కంపెనీని ఆదేశించింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వల్లే దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఈ ముడి సరుకును తిప్పి పంపించగలిగామని మంత్రులు కూడా ప్రకటించారు. 

అయితే.. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉందనేది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనుమానం. ఎల్జీ పాలిమర్ యాజమాన్యానికి నష్టం కలుగకుండా ప్రభుత్వం స్టైరిన్ తరలించి మేలు చేసిందని ఇప్పుడు జనం కోసం నిర్ణయం తీసుకున్నామని చెబుతూ పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తోంది.

ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ ఎల్జీ యాజమాన్యం నేరం నిరూపణ అయితే 30కోట్లు కాదని 300కోట్లు పరిహారం చెల్లించాల్సి వస్తుందని అంటోంది. ఎల్జీ పాలిమర్ కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీల నివేదికలు త్వరలో రానున్నాయి. వీటి అన్నింటినీ ఆధారంగా చేసుకుని కంపెనిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది.