అమరావతి: కోవిడ్ బాధితుల నుండి వైద్యం పేరిట ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ దాఖలయిన పిల్ పై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. అయితే కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని...  అందుకోసం విచారణను వాయిదా వేయాలని అదనపు అడ్వకేట్ జనరల్ కోరారు.  దీంతో విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. 

కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురయి ఒళ్లు గుల్లవుతుంటే వైద్యం ముసుగులో ప్రయివేట్ ఆసుపత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఇంటిని గుల్లచేస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ అయితే ఫీజు కట్టేంతవరకు మృతదేహాలను అప్పగించకపోవడం వంటివి కూడా చేస్తున్న ఘటనలు ఇటీవల బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో కరోనా బాధితుల నుండి ప్రైవేట్ హాస్పిటల్స్ అక్రమంగా వసూలుచేస్తున్న ఈ అధిక ఫీజుల దోపిడీపై ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ధాఖలయ్యింది. 

మెడిసిన్స్ అధిక ధరలకు విక్రయించడం, ప్రభుత్వ ఆదేశాలను ప్రయివేట్ ఆసుపత్రులు భేఖాతర్ చేస్తున్నాయంటూ పిల్ దాఖలయ్యింది. కరోనాతో చనిపోయిన వారికి 7 నుండి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని పేర్కొంటూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ పిల్ ను మైకోర్టులో దాఖలుచేశారు. 

read more   అధిక ఫీజులు: విజయవాడ లిబర్టీ ఆసుపత్రిపై చర్యలు

ఇదిలావుంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9,536 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసులు 5లక్షల 67వేల123కి చేరుకొన్నాయి.

 గత 24 గంటల్లో 66 మంది కరోనాతో మరణించారు.అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురి చొప్పున కరోనాతో మరణించారు. కడప, విశాఖపట్టణంలలో ఆరుగురి చొప్పున చనిపోయారు. చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూల్ లలో ఐదుగురి చొప్పున కోవిడ్ కారణంగా కన్నుమూశారు. గుంటూరు, విజయనగరంలలో నలుగురి చొప్పున చనిపోయారు. పశ్చిమగోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరు 4,912 మంది మరణించారు. 

ఏపీలో యాక్టివ్ కేసులు 95,072 ఉన్నాయి. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 4 లక్షల 67వేల 139 మంది కోలుకొన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 521, చిత్తూరులో 957, తూర్పుగోదావరిలో 1414, గుంటూరులో 792, కడపలో 585, కృష్ణాలో 397, కర్నూల్ లో 441, నెల్లూరులో 844, ప్రకాశంలో  788, శ్రీకాకుళంలో 733, విశాఖపట్టణంలో 415, విజయనగరంలో 573, పశ్చిమగోదావరిలో 1076 కేసులు నమోదయ్యాయి.