అమరావతి: రాజధాని భూముల విషయంలో గత టిడిపి ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసింది. అయితే సిట్  ఏర్పాటును సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్ధానం ఇరువర్గాల వాదనలు వింది. అనంతరం హైకోర్టు పూర్తితీర్పును రిజర్వ్ చేసింది. 

గత చంద్రబాబు ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు సీనియర్ ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో పది మంది సభ్యులతో జగన్ సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తు మొదలు విచారణ, చార్జిషీట్ వరకు అధికారాలు కట్టబెడుతూ ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. 

మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాలపై దర్యాప్తు చేసి కేసులు దాఖలు చేసేందుకు ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. సీఆర్డీఎ పరిధిలో జరిగిన అవినీతి, ఇన్ సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీలు వంటి అంశాలపై సిట్ దర్యాప్తు చేస్తుంది. అమరావతి విషయంలోనే కాకుండా ఇతర ప్రాజెక్టులపై కూడా సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. 

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సాక్షులను విచారించడంతో పాటు చార్జిషీట్ కూడా సిట్ దాఖలు చేయడానికి అధికారాన్ని కలిగి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారు పలువురు చిక్కులను ఎదుర్కునే అవకాశం ఉంది. 

read more  వితంతువులకు పెన్షన్ల నిలిపివేత: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

అమరావతిలో అక్రమాలపై ఇప్పటికే సీఐడీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసింది. పలువురు బినామీలు అమరావతి రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూములు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. బినామీలను ఏర్పాటు చేసుకుని వారు భూములను సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.