వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఈ కేసులో శుక్రవారం సీబీఐ వాదనలు వినిపించనుంది. ప్రాణహాని లేదు కనుక బెయిల్ ఇవ్వాలని శివశంకరరెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు .

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy) హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, మరో నిందితుడు సునీల్‌యాదవ్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. నిందితుల తరఫున వారి న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసులో వివేకా కుమార్తె సునీత (sunitha reddy) కూడా కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో సిబిఐ ఎల్లుండి వాదనలు వినిపించనుంది. నిందితుల నుంచి వాంగ్మూలాలు సేకరించారని.. వారికి ఎటువంటి ప్రాణహాని లేదని కోర్టుకు తెలిపారు న్యాయవాదులు. ప్రాణహాని లేదు కనుక నిందితులకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు శివశంకరరెడ్డి తరఫు న్యాయవాదులు. 

అయితే తమ వాదనలూ వినాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామని సునీత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మృతుడి కుమార్తెగా ఆమె ఇంప్లీడ్ అయ్యేందుకు అర్హత ఉందని న్యాయవాది చెప్పారు. శివశంకర్ రెడ్డి పిటిషన్ న్యాయమూర్తి కొట్టేశారని గుర్తుచేశారు. 
ప్రస్తుత వ్యాజ్యం అక్కడికే విచారణకు వెళ్లాలని మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాదులు. 

కాగా. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న Devireddy Siva Shankar Reddy బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ పిటిషన్ లో తాను కూడా ఇంప్లీడ్ అవుతానని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి ఈ ఏడాది మార్చి 26న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమైసమగ్ర వివరాలతో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమె ప్రకటించారు. ఈ మేరకు మే 2వ తేదీన ఏపీ హైకోర్టులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వ్యాజ్యంలో తనను ప్రతి వాదిగా చేర్చాలని పిటిషన్ దాఖలు చేశారు.

ఇకపోతే.. ఈ కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డిని గతేడాది నవంబర్ 17న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారి కీలక సమాచారాన్ని ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. 2019 మార్చి 14న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణమని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.