Asianet News TeluguAsianet News Telugu

పుంగనూరు అంగళ్లు కేసు: 79 మంది టీడీపీ నేతలకు బెయిల్

పుంగనూరులోని అంగళ్లు కేసులో 79 మంది టీడీపీ నేతలకు  ఏపీ హైకోర్టు గురువారంనాడు బెయిల్ మంజూరు చేసింది.

AP High Court Grants Bail To 79 TDP Workers in Punganur Angallu Case lns
Author
First Published Sep 21, 2023, 2:22 PM IST

అమరావతి: పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు కేసులో 79 మంది టీడీపీ నేతలకు   ఏపీ హైకోర్టు గురువారంనాడు మంజూరు చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది ఏపీ హైకోర్టు.

 బెయిల్ వచ్చిన వారు ప్రతి మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసుల్లో  మరో 30 మంది టీడీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీరిని అరెస్ట్ చేయవద్దని  హైకోర్టు ఆదేశించింది. పుంగనూరు అంగళ్లు కేసులో అరెస్టైన టీడీపీ నేతలు, కార్యకర్తలను  చిత్తూరు, మదనపల్లె, కడప జైలులో ఉన్నారు. హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయడంతో  జైలు నుండి వీరంతా విడుదల కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అంగళ్లు వద్ద ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటనలో  పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో అరెస్టైన టీడీపీ నేతలు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్లపై విచారణ నిర్వహించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జగన్ సర్కార్  అలక్ష్యం చేస్తుందని  టీడీపీ ఆరోపించింది. సాగు నీటి ప్రాజెక్టులను పరిశీలించి ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు  చంద్రబాబు  ప్రాజెక్టుల బాట పట్టారు. ఈ క్రమంలోనే  పుంగనూరు నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు పర్యటించేందుకు వెళ్లిన సమయంలో  టీడీపీ, వైసీపీ వర్గీయులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చంద్రబాబు రూట్ మారి రావడంతో  ఈ ఘర్షణ జరిగిందని అప్పట్లో పోలీసులు ఆరోపించారు.  అయితే చంద్రబాబు వెళ్లే మార్గంలో వైసీపీ శ్రేణులు లారీని అడ్డంగా పెట్టినా కూడ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని  టీడీపీ ఆరోపణలు చేసింది. చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడికి యత్నించారని టీడీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios