టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాడు నాయుడును విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకోవడంతో పాటు సీఆర్‌పీసీ 151 నోటీసులపై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.

ఈ సందర్భంగా న్యాయస్థానం డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖలో చంద్రబాబు ఘటనతో పాటు అమరావతి గ్రామాల్లో పోలీసుల కవాతు, ఆంక్షలపైనా కోర్టు ప్రశ్నించింది. సీఆర్‌పీసీ 151 సెక్షన్‌ను పోలీసులు ఒకసారి చదివాలన్న ప్రధాన న్యాయమూర్తి విశాఖ పోలీసు అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించింది.

Alspo Read:బాబు విశాఖ టూర్‌పై డీజీపీకి హైకోర్టు షాక్: 12న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండటం వల్ల చర్యలు తీసుకోలేదని డీజీపీ సమాధానం ఇచ్చారు. న్యాయస్థానం ఆదేశిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని డీజీపీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే తామే తీసుకుంటామన్న సీజే ... కిందిస్థాయి అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తే దానిని సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు. అలాగే విశాఖలో అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. 

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో పాల్గొనేందుకు గాను విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో అడుగుపెట్టకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.

Also Read:విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ, టీడీపి నేతలపై కేసులు

దీంతో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్ధితులు అదుపు తప్పకుండా విశాఖ పోలీసులు చంద్రబాబును సీఆర్‌పీసీ 151 సెక్షన్ కింద నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు తిప్పి పంపిన సంగతి తెలిసిందే.