విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడిని విశాఖపట్నం విమానాశ్రయం వద్ద అడ్డుకున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రబాబును అడ్డుకున్నవారిపై సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 32 మంది వైసీపీ నేతలపై, 20 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

వారిపైనే కాకుండా ఉత్తరాంధ్ర జేఏసీ నేత రామారావుపై, ఇతర ప్రజా సంఘాల నాయకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు విశాఖపట్నం పర్యటన సందర్బంగా వాహనంపైకి ఎక్కి హంగామా చేసిన రామారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: విశాఖలో పర్యటిస్తా, ఎన్నిసార్లు ఆపుతారో చూస్తా: చంద్రబాబు

చంద్రబాబు పర్యటన సందర్భంగా ర్యాలీలు గానీ నిరసన కార్యక్రమాలు గానీ చేపట్టవద్దని పోలీసులు ముందుస్తుగా హెచ్చరించినప్పటికీ వినకుండా ఆందోళనలకు దిగడంతో ఈ కేసులు నమోదు చేశారు. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన చంద్రబాబును అడ్డుకోవడానికి ఏ వైపు వైసీపీ కార్యకర్తలు, వారికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు విమానాశ్రయానికి రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

ఆందోళనలను సద్దుమణగకపోవడంతో చంద్రబాబును సెక్షన్ 151 కింద అదుపులోకి తీసుకుని విమానంలో హైదరాబాదు పంపించారు. తనను విశాఖలోకి అనుమతించకపోవడంతో పోలీసుల చర్యకు నిరసనగా చంద్రబాబు విమానాశ్రయం వద్ద బైఠాయించిన విషయం తెలిసిందే. 

Also Read: పంతం నెగ్గించుకున్న పోలీసులు: ఎట్టకేలకు ఫ్లైటెక్కిన చంద్రబాబు