ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు: మధ్యంతర ఉత్తర్వులకు ఏపీ హైకోర్టు నో
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మంగళవారం నాడు ఏపీ హైకోర్టు నిరాకరించింది.
అమరావతి: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మంగళవారం నాడు ఏపీ హైకోర్టు నిరాకరించింది.ఈ విషయమై కౌంటర్లు దాఖలు చేయాలని ఎస్ఈసీ, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జిల్లా పరిషత్ ఎన్నికలు వెంటనే జరపాలని దాఖలైన అనుబంధ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది.
ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎస్ఈసీ నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ఎస్ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో ఈ నెల 18వ తేదీన మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.ఎన్నికలు నిర్వహించకుండా ఎస్ఈసీ సెలవుపై వెళ్తున్నారని ఆ పిటిషన్లలో ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నర్ ను కలిసి కూడ ఇదే విషయమై విన్నవించారు.
గ్రామపంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి.ఈ రెండు ఎన్నికల్లో కూడ వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తైతే ఈ ఎన్నికల్లో కూడ తాము మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొంటామని వైసీపీ ధీమాతో ఉంది.