రూల్‌ ఆఫ్‌ లాను న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్ధలు అమలు చేయాల్సిందేనన్నారు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి. ప్రతీ వ్యక్తికీ తిండీ, బట్టతో పాటు న్యాయం అందినప్పుడే రాజ్యాంగ ఫలాలు అందినట్లని ఆయన అన్నారు.

సమాజంలో జనానికి న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్ద జోక్యం తప్పనిసరి అవుతోందని మహేశ్వరి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురుకాబోతున్నాయని చీఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవస్ధల మధ్య సంక్షోభాలకు అవకాశం లేదని, ఎవరైనా సమాజం కోసం దేశం కోసం పనిచేయాల్సిందేనని మహేశ్వరి స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని గుర్తుంచుకుంటే వ్యవస్ధల మధ్య సంక్షోభం రాదని.. రాజ్యాంగాన్ని ఇతర వ్యవస్థలు ఉల్లంఘిస్తే మా జోక్యం తప్పనిసరన్నారు. హైకోర్టు నిష్పాక్షికంగానే తన బాధ్యత నిర్వర్తిస్తోందని జస్టిస్ మహేశ్వరి తెలిపారు. 

Also Read:చట్ట సభల్లో తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించే వీల్లేదు: స్పీకర్ తమ్మినేని

కాగా న్యాయవ్యవస్థల మీద నిఘా వార్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ తరహా ప్రచురణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని ఏపీ సర్కార్ ఆరోపించింది.

కొన్ని రాజకీయ శక్తులు కావాలనే పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నది ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. కాగా ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న కొందరు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతున్నట్లుగా శుక్రవారం కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై జగన్ ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.