వ్యక్తిగతంగా హాజరు కావాలి: విద్యాశాఖ సెక్రటరీకి ఏపీ హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఏపీ హైకోర్టు బుధవారంనాడు ఆదేశించింది.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఏపీ హైకోర్టు బుధవారంనాడు ఆదేశించింది. ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ల నియామాకాలపై స్పష్టమైన ఆదేశాలున్నా అమలు చేయలేదని కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. టీచర్ల పోస్టుల నియామాకాలు చేపట్టడం లేదని విద్యాసంస్థల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ విషయమై కోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోగా నిర్వీర్యం చేస్తున్నారని ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది.
2013 నుండి విద్యాశాఖలో పనిచేసిన అందరూ అధికారులు ఇందుకు బాధ్యులేనని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఎయిడెడ్ స్కూళ్లలో రేషనలైజేషన్ పై ఇచ్చిన జీవోను కోర్టు దృష్టికి తెచ్చారు అడ్వకేట్ జనరల్. కోర్టు ఆదేశాలు , ప్రభుత్వ ఉత్తర్వులకు ఏమైనా సంబంధం ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది.ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.గతంలో కొందరు ఉన్నతాధికారులను కోర్టు ముందు హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను పాటించలేదని పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు ఉన్నతాధికారులను కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు కొందరు అధికారులకు శిక్షలను కూడ విధించింది. అయితే ఉన్నతాధికారుల విన్నపం మేరకు కొన్ని శిక్షలను కోర్టు తగ్గించడమో, రద్దు చేయడమో చేసింది.