అమరావతి: రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య కేసులో సమగ్ర విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రవీంద్రన్ ను నియమిస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టుల్లో కేసులు వేయించారన్న జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈశ్వరయ్య  ఘటనపై సమగ్ర విచారణ చేసేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి రవీంద్రన్ నియమించింది. 

జడ్జి రామకృష్ణ కోర్టుకు సమర్పించిన పెన్ డ్రైవ్ లోని సంభాషణపై నిజ నిర్ధారణ చేయాలని కూడ కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో నివేదికను ఇవ్వాలని కూడ హైకోర్టు కోరింది. గతంలో సుప్రీం కోర్టు సూచనతో ఎన్ఐఏ తరపున కేసు దర్యాప్తును రవీంద్రన్ పర్యవేక్షించారు. 

జస్టిస్ రామకృష్ణతో రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ విషయమై జస్టిస్ ఈశ్వరయ్య ఈ నెల 9వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

జడ్జి రామకృష్ణతో  తాను మాట్లాడినట్టుగా ఆయన స్పష్టం చేశారు. రామకృష్ణకు సహాయం చేసేందుకు ప్రయత్నించినట్టుగా ఆయన చెప్పారు.ఈ ఆడియోను బయట పెట్టి తనను అల్లరి చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తనకు న్యాయ వ్యవస్థ పట్ల, జడ్జిలపై గౌరవం ఉందని ఆయన వివరణ ఇచ్చారు.