లేని జోవోలపై విచారణ,స్టే ఇవ్వండి: సీఐడీ కేసుపై హైకోర్టులో చంద్రబాబు న్యాయవాది
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం నాడు మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది.
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం నాడు మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది.
అమరావతిలో అసైన్డ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి గత మాసంలో ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో జారీ చేసిన 41 జీవో కారణంగా అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబునాయుడికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23 వ తేదీ లోపుగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు ఏపీ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్థ లూథ్రా వాదించారు. ఇదే పిటిషన్ పై మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు వాదించారు.
ప్రభుత్వ నిర్ణయంపై విచారణ చేసే అధికారం విచారణ సంస్థకు లేదని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించారు.అధికారాన్ని తప్పుదోవపట్టించేందుకే ఈ ఫిర్యాదులు చేశారని ఆయన ఆరోపించారు.ఈ కేసులో స్టే ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.చంద్రబాబు తరపు న్యాయవాది హైకోర్టులో తమ వాదనలు విన్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలను విన్పించనున్నారు.
బాధితులు నేరుగా ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా నమోదు చేస్తారని బాబు తరపు న్యాయవాది ప్రశ్నించారు. గతంలో అనేక ఫిర్యాదులు ఇలానే చేసినా అవి నిజం కాదని కోర్టులే నిర్ధారించాయని మాజీ మంత్రి నారాయణ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు చెప్పారు.బాధితులు ఎవరూ కూడ నేరుగా ఫిర్యాదులు చేయని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.