Chandrababu Naidu ఐఆర్ఆర్, ఇసుక పాలసీ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు: చర్యలొద్దని హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు , ఇసుక పాలసీలో అవకతవకలపై చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.
హైదరాబాద్: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మరో వైపు ఇసుక పాలసీలో అక్రమాలపై చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ రెండు కేసుల్లో చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు విషయంలో చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసింది. అలైన్ మెంట్ ను తమ అనుయాయులకు లబ్ది కలిగేలా మార్చారని సీఐడీ కేసు నమోదు చేసింది.ఈ కేసులో ముందస్తు బెయిల్ ను కోరుతూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.అయితే చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని ఏపీ సీఐడీ హైకోర్టులో 470 పేజీలతో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది.
చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని ఏపీ సీఐడీ కోరింది. సీఐడీ వినతి మేరకు ఈ పిటిషన్ విషయమై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టులో వాదనలు విన్పించాల్సి ఉంది. ఈ మేరకు తమకు సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. దరిమిలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
మరో వైపు ఇసుక పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసుపై ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.ఉచిత ఇసుక పాలసీ పేరుతో అక్రమాలకు చంద్రబాబు సర్కార్ పాల్పడిందని మైనింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసింది.