ఏపీలో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమదే: వైద్యారోగ్య శాఖ మంత్రి

కరోనా టెస్టులు చేయడంలో ఏపీ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. 

ap health minister alla nani pressmeet comments on corona

అమరావతి: కోవిడ్ కేసులు పెరగటానికి ప్రధాన కారణం రాష్ట్రంలో అధికంగా టెస్టులు చేయడమేనని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) పేర్కొన్నారు. టెస్టులు చేయడంలో ఏపీ దాదాపు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందన్నారు. ఇంతటితో ఆగకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో టెస్టులు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపడుతున్నారని మంత్రి వెల్లడించారు. 

''తూర్పు గోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా బెడ్స్ పెంచుతున్నాం. ఈ జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులు ఇప్పటికే ఆరు ఉండగా అదనంగా మరో మూడు ఏర్పాటు చేయబోతున్నాం. రెండు కోవిడ్ కేర్ సెంటర్లు ఉంటే కాకినాడ ప్రాంతంలో అదనంగా మరో సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం'' అని తెలిపారు.

''ఇప్పటికే డాక్టర్లు, వైద్య సిబ్బంది రిక్రూట్ మెంటును మొదలుపెట్టాం. కొద్దిరోజుల్లోనే పూర్తి చేస్తాం. కోవిడ్ కేంద్రాల్లో క్వాలిటీ, బలవర్థకమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మెనూకు సంబంధించి ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిపైన తక్షణం చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి కోవిడ్ పేషెంట్ పై రోజుకు రూ. 500 వెచ్చించడం జరుగుతుంది. ఎక్కడా, ఏ విధమైనా ఇబ్బంది రాకుండా అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది'' అని అన్నారు. 

read more  సీఎం మాటలు... పుట్టెడు దు:ఖంలోనూ మానవత్వాన్ని చాటిన తల్లీ కొడుకులు: మంత్రి నారాయణ

''ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఏ పేషెంట్ కు వైద్యం నిరాకరించినా ప్రభుత్వ నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. కోవిడ్ వల్ల చనిపోయిన వారి మృతదేహాలను కొన్ని ప్రాంతాల్లో మార్చురీల్లోనే ఉంచుతున్నారు. ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది'' అని అన్నారు. 

''కరోనా మరణాలకు సంబంధించి లెక్కలు సరిగా చెప్పటం లేదని చంద్రబాబు పదే పదే విమర్శలు చేస్తున్నారు. కానీ కరోనా నియంత్రణలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పనిచేస్తుంది. దేశంలో ఎక్కడా ఖర్చు చేయనన్ని నిధులు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ మాత్రం కనీస అవగాహన లేకుండా చంద్రబాబు రోజూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదు. చంద్రబాబు కోవిడ్ నూ రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయాలని చూసే చంద్రబాబును ప్రజలు క్షమించరు'' అని హెచ్చరించారు. 

''కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుంది. ఖచ్చితంగా నియంత్రిస్తాం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే రాష్ట్రంలో మరణాలు తగ్గాయి.  కరోనా పేషెంట్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు చనిపోతే.., ఎటువంటి అపోహలకు తావివ్వకుండా, నిర్భయంగా దహన సంస్కారాలు చేయవచ్చు. ఆరు గంటల తర్వాత మృత దేహంపై ఎటువంటి వైరస్ ఉండదని డబ్ల్యూహెచ్‌వో, ఇతర వైద్యారోగ్య సంస్థలు వెల్లడించాయి. ఒకవేళ ఎవరైనా ఆ మృతదేహాలను తీసుకెళ్ళకపోతే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని లీగల్ కార్యక్రమాలు పూర్తి చేసి లాంఛనాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం'' అని తెలిపారు. 

''కోవిడ్ నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. సరిపడినన్ని బెడ్లు సిద్ధం చేశాం. వైద్య సిబ్బంది ఉన్నారు.  కొత్తగా 17 వేల మంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని రిక్రూట్ చేస్తున్నాం. కరోనా టెస్టుల ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఈరోజు తూర్పు గోదావరి జిల్లా సమీక్షలో జిల్లాలో 24 గంటల్లోనే ఫలితాలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు'' అని మంత్రి పేర్కొన్నారు. 

''గర్భిణీలు డెలివరీల కోసం ఆసుపత్రులకు వస్తే వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. అవసరమైతే ప్రభుత్వాసుపత్రుల్లో గైనకాలజీకి సంబంధించిన వార్డులు పెంచమని కలెక్టర్లకు సూచించడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయటానికి ఎవరైనా నిరాకరించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విపత్కర పరిస్థితుల్లో మీ సేవలు కూడా ప్రభుత్వానికి, ప్రజలకు అవసరం. వైద్య సేవలు అందించకపోతే కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదు'' అని మంత్రి హెచ్చరించారు. 

''కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్స్ కు సంబంధించిన వివరాలను ఆయా ఆసుపత్రుల వద్దే డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కోవిడ్ కేర్ ఆసుపత్రుల్లో బెడ్స్ కు సంబంధించిన వివరాలను ప్రభుత్వ వెబ్ సైట్ లో కూడా ఉంచుతాం.  కోవిడ్ నేపథ్యంలో.. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇది చట్ట విరుద్ధం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు, చార్జీలు వసూలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం'' అని మంత్రి నాని స్పష్టం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios