కోవిడ్ మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైరస్ సోకి మరణించిన వారి అంత్యక్రియలకు రూ.15వేలు సాయం అందించనున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిడ్‌ కారణంగా మరణించే వారి అంత్యక్రియల ఖర్చుల కోసం ఈ సాయం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసింది. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విశ్వరూపాన్ని చూపిస్తోంది. గడిచిన కొన్నిరోజుల్లో ఎన్నడూ లేని విధంగా ఇవాళ రోజు వారీ కేసులు 24 వేలను దాటిపోయాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట కర్ఫ్యూను సైతం ప్రభుత్వం అమలు చేస్తోంది.

Also Read:ఏపీలో కరోనా విశ్వరూపం: మళ్లీ 24 వేలు దాటిన కేసులు.. తూ.గో వెనక్కి, అగ్రస్థానంలో అనంతపురం

దీనికి తోడు కొన్ని చోట్ల కఠిన ఆంక్షలను సైతం విధించారు. అయినప్పటికీ కేసుల తీవ్రతలో ఎలాంటి మార్పు లేకపోవడంతో అధికార వర్గాల్లో ఆందోళన మొదలైంది.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 24,171 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 14,35,491కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 101 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 9372కి చేరుకుంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 94,550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 21,101 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు.