Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగ యువతకు శుభవార్త...16వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం

ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని వైసిపి ప్రభుత్వం నిర్ణయించింది. 

AP Grama Volunteer Recruitment 2020... Exam date Confirmed
Author
Amaravathi, First Published Aug 12, 2020, 6:33 PM IST

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని వైసిపి ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు తేదీలను ఖరారు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలకశాఖా మంత్రి బొత్స సత్యనారాయణలు పరీక్షల నిర్వహణ, పరీక్షల తేదీలపై పలు శాఖల అధికారులతో సమీక్షించిన అనంతరం తేదీలను ప్రకటించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా వున్న పోస్ట్‌ లకు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించాలని...వారంరోజల వ్యవధిలో పరీక్షల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో కోవిడ్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పరీక్షా కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థి భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించారు. 

పరీక్షల తొలి రోజున దాదాపు నాలుగున్నర లక్షల మంది అభ్యర్ధులు పాల్గొంటారనే అంచనాల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు. మొత్తం పద్నాలుగు పేపర్లతో నిర్వహించే పరీక్షలను వారం రోజుల వ్యవధిలో పూర్తి చేస్తామని ఈ సందర్బంగా అధికారులు వివరించారు. అయితే వేర్వేరు పోస్ట్‌లకు పరీక్షలు రాసే అభ్యర్ధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని...  అందుకు తగ్గట్లుగా పరీక్షల తేదీలను ఖరారు చేయాలని మంత్రులు సూచించారు. 

గతంలో సచివాలయ ఉద్యోగాల కోసం నిర్ణయించిన సెంటర్లలో కొన్ని చోట్ల కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహిస్తున్నారని...ఈ నేపథ్యంలో వాటికి ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాలను ప్రత్యామ్నాయ సెంటర్‌లకు మార్చాలని మంత్రులు సూచించారు. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ పోస్ట్‌లు భర్తీ కావడం లేదని, ఎక్కువగా ఖాళీలు వుంటున్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేయాల్సి వుందని, దానిపై అధికారలు దృష్టి సారించాలని కోరారు. అవసరమైతే అదే అర్హతతో కూడిన ప్రత్యామ్నాయ కోర్సులు చేసిన వారికి కూడా అవకాశాలు కల్పించే అంశంను కూడా పరిశీలించాలని సూచించారు. 

ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్ గిరిజాశంకర్, విలేజ్, వార్డు సెక్రటేరియట్ శాఖ కమిషనర్ నవీన్, ఎపిపిఎస్సీ, పశుసంవర్థక, వ్యవసాయశాఖ, పురపాలకశాఖ అధికారులు పాల్గొన్నారు. 

16,208  పోస్ట్‌ల భర్తీకి చకచకా ఏర్పాట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగాల విప్లవానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ పోస్ట్‌ల భర్తీకి గానూ 2019లో 1,10,520 పోస్ట్‌లను భర్తీ  చేసింది. తొలి విడతలో భర్తీ కాకుండా మిగిలిన 16,208 పోస్ట్‌ల భర్తీ కోసం ఈ ఏడాది జనవరి 10వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 14,062 గ్రామ సచివాలయాల పోస్ట్‌లు, 2,146 వార్డు సచివాలయ పోస్ట్‌ల భర్తీకి వచ్చేనెల (సెప్టెంబర్ )20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షల కోసం 10,63,168 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. 

ఖాళీల వివరాలు:

యానిమల్ హస్బెంటరీ అసిస్టెంట్ - 6858

విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ - 1783

ఎఎన్ఎం, వార్డ్ హెల్త్ సెక్రటరీ (గ్రేడ్-3) - 648

విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-3) - 1255

పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్-6) డిజిటల్ అసిస్టెంట్ - 1134

మహిళా పోలీస్ - 762

వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-2) - 844

ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-2) 570

విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ - 536

వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ  (గ్రేడ్-2) - 513

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ - 97

వార్డు ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్-2) - 371

విఆర్‌ఓ (గ్రేడ్-2) - 246

వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2) - 213

వార్డు అడ్మినిస్ట్రేటీవ్ సెక్రటరీ -105

వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ - 100

విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ - 69

పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్-5) - 61

విలేజ్ సెరీకల్చరల్ అసిస్టెంట్ - 43

Follow Us:
Download App:
  • android
  • ios