అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం తెలియజేయాలని  ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ విషయంపై కేంద్ర హోంమంత్రికి నిరసన వ్యక్తం చేస్తూ లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర హోంమంత్రి స్వయంగా కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. 

లేఖలో ప్రస్తావించాల్సిన అంశాలపై తగిన నివేదిక ఇవ్వాలని చంద్రబాబు పోలీస్ అధికారులను, న్యాయనిపుణులను కోరారు. జగన్‌పై దాడి కేసు ఎన్ఐఏకి అప్పగించిన విషయంపై చంద్రబాబు అడ్వొకేట్ జనరల్ తోనూ డిజీపితోనూ చర్చించిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.