రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం పలికింది. కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.

మే 13 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి టెండర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించింది. అలాగే జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు టెండర్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది.

టెండర్ల టెక్నికల్ బిడ్‌ను అదే రోజు సాయంత్రం 5 గంటలకు తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మే 20 న సాయంత్రం 5 గంటలకు ఫ్రీ బిడ్ మీటింగ్‌ను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ టెండర్లలో పాల్గొనేవారు ఏపీఎంఎస్ఐడీసీ పేరిట ఈఎండీ కింద 3 లక్షల రూపాయల డీడీ తీయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. 

Also Read:కరోనాతో సహజీవనం చేయాల్సిందే: మరోసారి జగన్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. రెండు రోజుల పాటు తెరిపినిచ్చిన మహమ్మారి మళ్లీ పంజా విసిరింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. కానీ కేసుల తీవ్రత పెరుగుతుందే తప్ప ప్రయోజనం మాత్రం శూన్యం. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,399 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 13,66,785కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 89 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 9,077కి చేరుకుంది.