అమరావతి: భూముల రీ సర్వే చేయాలని వైసిపి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడులో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రకటించారు. 2023 జూలై నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. భూముల అంశంలో ఏ చిన్న సమస్య ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణదాస్ వెల్లడించారు. 

''సీఎం జగన్ గతంలో చేపట్టిన పాదయాత్రలో భూ వివాదాలపై ప్రజలు అనేక ఫిర్యాదులు అందాయి. ప్రజలందరికీ మేలు చేసే కార్యక్రమం ఈ భూ సర్వే. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించినా ప్రైవేట్ సంస్థల వలన అది పూర్తి కాలేదు. ఈసారి మేము సర్వే ఆఫ్ ఇండియా తో కలిసి పని చేస్తున్నాం'' అని తెలిపారు.

''స్థిరాస్తులు అన్ని సర్వే చేస్తాం. గ్రామ సచివాలయాల్లో ఈ భూ రికార్డ్ లు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి రైతులకు అండగా నిలుస్తాం. చట్టబద్ధమైన, న్యాయమైన  హక్కులు చేకూరుతాయని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ అంశంపై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. అత్యాధునిక సాంకేతికత తో సర్వే నిర్వహిస్తాం ప్రజలతో పాటు, ప్రతిపక్షాలు కూడా ఈ కార్యక్రమం కు సహకరించాలని కోరుతున్నాం'' అన్నారు.

సిసీఎల్ఏ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ... డ్రోన్స్, రోవర్స్ ద్వారా సర్వే నిర్వహిస్తామన్నారు. పైలట్ ప్రాజెక్ట్ లో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయన్నారు. కొత్త పద్దతులతో పాటు అవసరమైతే పాత పద్దతిలో కూడా కొలిచి చూపిస్తామన్నారు. గ్రామాల స్థాయిలో అక్కడిక్కడే వివాదాలు పరిష్కరిస్తామని... తర్వాత 30 రోజుల్లో మొబైల్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చన్నారు. మూడో స్టేజిలో జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా ట్రిబ్యునల్ ఉంటుందన్నారు.

భూముల సర్వే కోసం ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతికత వినియోగిస్తున్నామన్నారు. అవసరమైతే ఎవరైనా సివిల్ కోర్ట్ కు వెళ్లొచ్చని నీరబ్ కుమార్ పేర్కొన్నారు.