అమరావతి: ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్సార్ 71వ జయంతిని పురస్కరించుకుని జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష టిడిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైఎస్సార్ జన్మదినాన్ని రైతు దినోత్సవంగా  ప్రకటించినట్లే వైఎస్ జగన్ పుట్టినరోజును దొంగల దినోత్సవంగా ప్రకటించాలంటూ తెలుగుయువత రాష్ట్ర నాయకులు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. 

తెలుగుయువత నాయకులు సీఎస్ కు రాసిన లేఖ యదావిధిగా... 

గౌరవనీయులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

నీలం సాహ్ని గారికి...

విషయం -  జగన్ పుట్టిన రోజును  దొంగల దినోత్సవంగా ప్రకటించాలి

మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించటం బాధాకరం. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులకు చేసింది శూన్యం. అయినప్పటికీ ఆయన జయంతిని రైతు దినోత్సవంగా రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. రూ. 43 వేల కోట్లు దోచుకుని 11 కేసుల్లో ఏ1 ముద్దాయి 16 నెలలు జైల్లో ఉండి దేశంలోని దొంగలందరికీ ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు డిసెంబర్ 21వ తేదీని దొంగల దినోత్సవంగా ప్రకటించాలి.  అలాగే మరికొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పుట్టినరోజుల్ని కూడా ప్రత్యేక దినోత్సవాలుగా గుర్తించాలి. 

విజయసాయిరెడ్డి జన్నదినాన్ని దొంగలెక్కల దినోత్సవం, మంత్రి బొత్స సత్యనారాయణ పుట్టినరోజును లిక్కర్ దినోత్సవం,  మంత్రి అనిల్ కుమార్ పుట్టిన రోజును బెట్టింగ్ దినోత్సవం, మంత్రి అవంతి శ్రీనివాసరావు పుట్టిన రోజును జంపింగ్ డే, రోజా పుట్టిన రోజును మహిళా సాంప్రదాయ దినోత్సవం, అంబటి రాంబాబు పుట్టిన రోజును గోబెల్స్ దినోత్సవం,  ఎమ్మెల్యే విడదల రజనీ పుట్టిన రోజును పబ్లిసిటి డేగా ప్రభుత్వం గుర్తించాలి. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులకు చేసింది శూన్యం. వైయస్ హయాంలో రైతుకీ మిగిలింది అప్పులు,ఆత్మహత్యలే. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ లో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించాల్సి వచ్చినది వైఎస్ హయాం లోనే. ఉమ్మడి రాష్ట్రంలో 3 లక్షల ఎకరాలకు పైగా రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. 14 వేల  మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. సకాలంలో సరిపడా ఎరువులు, విత్తనాల దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ముదిగొండ, కాకరాపల్లి, సోంపల్లిలో కాల్పులు జరిపి 15మంది రైతులను పొట్టన పెట్టుకొన్నారు. ఎరువులు అడిగిన రైతుల పై లాటీలతో కొట్టించారు.  ఎరువుల కోసం క్యూలో నిలబడిన రైతుల గుండెల ఆగిన సంఘటనలు కోకొల్లలు. రైతుల్ని అన్ని విధాల ఇబ్బందులకు గురి చేసి, వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోనెట్టిన వైయస్ జయంతిని  రైతు దినోత్సవం ప్రకటించారు. కాబట్టి జగన్ పుట్టిన రోజును దొంగల దినోత్సవంగా ప్రకటించాలని కోరుతున్నాము. 

మద్దిపట్ల సూర్యప్రకాశ్, రాంగోపాల్ రెడ్డి

తెలుగుయువత రాష్ట్ర నాయకులు